ఆళ్వార్లు. వీరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ముఖ్యులు. నిత్య అనుష్టాన బలం, మంత్రం, జప సిద్ధి కలిసి ఉన్నదానిని సంప్రదాయం అంటారు. సంప్రదాయం అంటే 'సకల ప్రాణుల శ్రేయోకాంక్ష' ఉన్నవారు మాత్రమే పాటించగలిగేది. (ఇతరమైన నిర్వచనాలు కేవలం తార్కికమైనవి).
అటువంటి సంప్రదాయ పరులైన ఆళ్వార్లలో ఒకరు ఒక రాత్రి సమయములో ఒక అరుగు మీద నిద్రిస్తున్నారు. వాన వస్తున్న కారణంగా మరొక ఆళ్వారు ఆ అరుగు మీదకు రాగా. నిద్రిస్తున్న ఆయన లేచి చోటు ఇచ్చారు. అలా వారిద్దరూ 'కూర్చొని' ఉండగా మూడో ఆళ్వారు వచ్చారు. అ చోటులోనే ముగ్గురూ ఇరుక్కొని నిలబడ్డారు. కాసేపటికే.. ఎవరో నాలుగో వ్యక్తి ఉన్నట్టుగా.. వారికి 'ఇరుకు' అనిపించింది. వెంటనే ఆ ముగ్గురికి ఒకేసారి తమ మధ్య భగవంతుడు ఉన్నట్టు అనుభూతి కలిగింది.
తార్కికంగా ఆలోచిస్తే అక్కడ ఉన్నది ఇరుకే అయినా 'అది' భగవంతుడు అని అనిపించేటంతగా వారి చేతన వికసించి ఉన్నది. వారికి ఈ వికాసం సామాజిక ఉద్యమాల వల్ల వచ్చినది కాదు. కేవలం 'సాంప్రదాయ' బలం వల్ల మాత్రమే ఒనగూడిన సమర్ధత.
విడి పూవులను దండగా చేసే దారం ఎలాంటిదో, వ్యక్తులను కుటుంబాలుగా.. తద్వారా సమాజంగా... చేసే సంప్రదాయం అలాంటిది. స్వేఛ్చ పేరుతో విశృంఖలత్వాన్ని కోరుతున్న వారే సంప్రదాయానికి చిచ్చు పెడుతున్నారు.
అనాది కాలం నుంచి ఇళ్లు ఉన్న చోట ఎలుకలు ఉండేవి. కానీ మనకిలాగా ఎలుకల పేరు చెప్పి ఇళ్లు తగలబెట్టుకుంటున్న వారు ఏ కాలంలోనూ లేరు. మరొకరి ద్వారా తప్పు తెలుసుకోవడం, దాన్ని దిద్దుకోవడం ఆత్మద్రోహం కాదు. ఆళ్వార్లను ఆదర్శంగా తీసుకుని మన ఇబ్బందిని, అసౌకర్యాన్ని భగవంతుడిగా భావించి మరొకరికి మేలు చేద్దాం.
No comments:
Post a Comment