గర్భంలో పడిన దగ్గర్నుంచి 8 ఏళ్లు అనేది ఆధ్యాత్మిక గణితం. అంటే పుట్టిన దగ్గరనుంచి ఏడేళ్ల వరకు బాల్యం కింద లెక్క. ఆహారం, నిద్ర అనే అవసరాలతో ఈ బాల్యం ప్రధానంగా ఆటపాటలతో గడిచిపోతుంది.
అప్పటినుంచి మరో 7 ఏళ్ల పాటు శరీరంలో అనేక కీలకమైన మార్పులు జరుగుతాయి. ఈ సమయంలోనే జీవుడికి ఇష్టాయిష్టాలు, కోపతాపాలు, అలకలు ఆనందాలు, రుచులు తదితర భావనలు రూపుదిద్దుకుంటాయి. హార్మోన్ల ఉత్పత్తి ప్రారంభమై శారీరక మార్పులు చాలా జరుగుతాయి.
అలా వచ్చిన 14 సంవత్సరాల వయస్సు నుంచి శారీరక దారుఢ్యం ఏర్పడటంతో పాటు స్వతంత్ర భావాలు బలపడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైన లక్షణాలు ఏర్పడతాయి. అలా 21 ఏళ్ల వయస్సు వచ్చేసరికి వ్యక్తి పూర్తి స్వతంత్రుడు అవుతాడు. అంటే పూర్తిగా జన్మ కర్మ అధీనంలోకి వెళ్లిపోతాడు.
ఈ లోపు గానే మనిషిని తీర్చిదిద్దు కోవాలి. ఎందుకంటే కర్మ అధీనంలో ఉన్న మనిషి తనకు తానుగా ఇష్టపడితే తప్ప ఇతరుల ప్రమేయం వల్ల తన గుణగణాలను మార్చుకోలేడు. ఈ వేదాంత సత్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
బాల్యప్రాయంలో కర్మ ప్రభావం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సమయంలోనే కర్మకు సంబంధం లేనటువంటి, మానసిక బలాన్ని పెంచుతూ పటిష్టపరిచేటటువంటి అలవాట్లను, విలువలను బాలుడికి వంట పట్టించాలి. స్వతహాగా బాల్యవస్థలో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆ ఉత్సాహాన్నే ఆసరాగా చేసుకుని మనో నిబ్బరాన్ని స్థైర్యాన్ని పెంచే అలవాట్లను ప్రోత్సహించాలి.
ఇంట్లో అలవాటు కానీ మంచి లక్షణం సమాజంలో అలవాటు అవుతుంది అనుకోవడం పచ్చి భ్రమ. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలి. అందుకనే బాల్యాన్ని సక్రమంగా పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. జీవుడు పెద్దయ్యాక కర్మస్థితులు, జీవిత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాల్యంలో నేర్చుకున్న విలువలు అలవాట్లు ఆ జీవుడిని చెడు మార్గంలోకి పోనీయకుండా సన్మార్గంలోనే ఉంచడానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ రహస్యాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదు.
అందుకనే బాల్య స్థాయిలో మంచి అలవాట్లు ఉన్నతమైన విలువలు బాలుడిలో నాటుకు పోయేలా తల్లిదండ్రులు తమ పెంపకంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆటపాటల్లోనే అత్యుత్తమమైన జీవన విలువలపై తమ పిల్లల్లో ప్రేరణ కలిగించ గలుగుతే చాలు. గారాబంతోనే మంచి మంచి అలవాట్లు చేయించడం ఇంకా తేలిక. అందుకనే దయచేసి చిన్న పిల్లల పెంపకంపై ప్రత్యేక ధ్యాస పెట్టండి.
మాటలు నేర్పించడంలోనే మనోశక్తిని పెంచే విధానాలు ఎన్నో ఉన్నాయి మర్చిపోకండి. తమ పిల్లల గుణగణాలు బాగుండాలి, తమ పిల్లలు మంచి ప్రవర్తనతో పెరగాలి, తమ పిల్లల్లో వ్యసనాలకు అలవాటు కానీ మనో ధైర్యం ఉండాలి అనుకునే తల్లిదండ్రులందరూ ఈ బాల్యవస్థని ముందు చూపుతో తీర్చిదిద్దుకోవాలి.
అంతేగాని వాళ్ళ కర్మ ప్రకారం వాళ్లు పెరుగుతారులే అనే పనికిరాని వేదాంతాన్ని వల్లించమని పెద్దలు ఏ యుగంలోనూ చెప్పలేదు.