Friday, 31 January 2025

తత్వోపాసన-సేవ

                         చివరిభాగం

ఒక విషయం ఏంటంటే సృష్టిలో సహాయం అనేది ఉండదు. సేవ అనేది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సహాయంలో మూడు గుణాలు ఉంటాయి. సేవలో త్రిగుణాలు ఉండవు. 

ఇలాంటి గుణరహితమైన సేవాస్థితికే బ్రాహ్మణస్థితి అని పేరు. ఇలాంటి బ్రాహ్మణ్యం శాశ్వతంగా ఒక జీవుడిలో నిలబడి పోవాలంటే తత్వ ఉపాసన చేయాల్సిందే. 

తత్వ ఉపాసనతో బ్రాహ్మణ్యం శాశ్వతం కాలేనప్పుడు ఆ జీవుడు తరచు అబ్రాహ్మణ స్థితిలో కూరుకుపోతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు మార్గాలు ఏర్పడ్డాయి. తత్వాన్ని భౌతికంగా నిలపాలన్నా, ఆలోచనల వేగం నియంత్రించాలన్నా ఆహార నియమం పాటించాల్సిందే. 

దీన్ని పాటించే వారికి అగ్నిహోత్రం ఇచ్చారు. అది పాటించలేని వారికి 'శ్రమ' ఇచ్చారు. ఈ శ్రమ వర్గమే సంఘ రక్షణకు క్షాత్రంగా, సంఘ కార్యకలాపాల నిర్వహణకు వాణిజ్యంగా నిలబడింది. ఇలా నాలుగు మార్గాలు ఏర్పడ్డాయి 

ఈ మార్గాలన్నీ సేవకు మార్గాలే. గుణ రహితమైనటువంటి సేవకు మార్గాలే. సేవా స్థితికి మారుపేరైన బ్రాహ్మణస్థితికి చేరుకోవటానికి మార్గాలే.

పేర్లు అనేవి మార్గాన్ని గుర్తు చేసేవి. ఎక్కువ తక్కువలు చేసేవి కాదు. నియమాలను పాటిస్తూ ఎవరైనా ఏ మార్గంలోనైనా జీవిస్తూ 'సేవకులు'గా మారచ్చు. 

విజయీభవ !!!

తత్వోపాసన-నియమం

                        మధ్యభాగం

సృష్టిలో ఉన్న భేదాలు రెండే. ఒకటి, తత్వ ఉపాసకులై పరుల శ్రేయస్సు గురించి ఆలోచించే వారు. రెండు,  తత్వ ఉపాసనకు దూరమై తమ శ్రేయస్సు గురించి మాత్రమే ఆలోచించుకునేవారు.

తత్వ ఉపాసనకు గుణ శుద్ధి అవసరం. పరుల శ్రేయస్సును గురించి ఆలోచించటం తోనే అది మొదలవుతుంది. ఈ ఉపాసనా పద్ధతి సొంతం అవాలంటే ఆహార - సంఘ నియమాలు పాటించాలి. మాయా సంబంధం వల్ల జీవుడు స్వ ఆలోచనలో ఉంటాడు దాన్ని తత్వ ఉపాసన అనే కొలిమిలో భస్మం చేయాలి. అప్పుడే సంఘంలో శ్రేయోజీవనం సాధ్యమవుతుంది. 

తత్వ ఉపాసన చేయాలనుకున్న వారు కచ్చితంగా 'తను' అని ఆలోచించకుండా పరుల మేలు కోరాల్సిందే. పరుల సేవ చేయాల్సిందే. అలాంటి జీవనం సాగించిన వారే మహర్షులు, ప్రవక్తలు, దేవ దూతలు. 

ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఒకటి మాంసాహారం, పరస్త్రీ వ్యామోహం ఉన్న వ్యక్తి ఆలోచనలు చేతలు చాలా పరిమితంగా ఉంటాయి దీనికి జడత్వం అని పేరు. ఈ జడత్వాన్ని పెంచుకుని, పోషించుకోవడమే అబ్రాహ్మణ స్థితి. ఇలాంటి జడత్వం నిండిన అబ్రాహ్మణులు ఎప్పటినుంచో సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు. 

ఇక రెండవది చైతన్య స్థితిలో ఉంటూ, ఇతరుల్లో చైతన్యం నింపడానికి కృషి చేయడమే బ్రాహ్మణ స్థితి. ఎవరైతే 'తమ' గురించే ఆలోచనలు లేకుండా పరుల శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటారో, వారే బ్రాహ్మణులు.  ఇలాంటి బ్రాహ్మణులు ఇప్పటికీ సమస్త కులాల్లోనూ మతాల్లోనూ ఉన్నారు.

తత్వోపాసన-ధర్మం

                      మొదటి భాగం

అనాదిగా ఉన్నది తత్వమే. మతం మధ్యలో వచ్చింది. హిందూ మతమైనా అంతే. 

కనపడని ఈ తత్వం, దాని లక్షణాన్ని జీవుడు ఇష్టపూర్వకంగా .. గురువుకు శుశ్రూష చేస్తూ ఒంటబట్టించు కోవటమే ఆధ్యాత్మిక జీవనం.

అన్నిటికీ మూలమైన ఈ తత్వం ఎవరి జీవనంలో ప్రకాశిస్తే ఆ జీవుడు ధర్మపరుడు అవుతాడు. అలా తత్వోపాసనతో ధర్మపరుడైన వ్యక్తి కదలికే మతం. తన నడవడికే ధర్మం. తను చెప్పేదే ధర్మం. తను ఆచరించేదే ధర్మం. అది అపరిమితం. 

అలా కాక తన నుంచి జీవుడు ప్రతిపాదించే ఏ ధర్మమైనా వికటించి తీరుతుంది. ఆహార నియమం, సంఘ నియమ పాటిస్తూ గురువు చెప్పిన సాధనా మార్గంలో త్రిగుణాలను శుద్ధి చేసుకోవడమే తత్వోపాసనకు తగిన జీవన విధానం. 

తత్వోపాసన లేని ధర్మ చింతన ఓ కల లాంటిది.